తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ మందగించిందని, ఐకేపీ సెంటర్లలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి గ్రామంలోని ఐకేపీ సెంటర్‌ను సందర్శించిన ఆయన, వరి ధాన్యాన్ని పరిశీలించి అక్కడి రైతుల సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆయన ఘాటు విమర్శలు చేశారు.
రైతులకు సాగునీరు, కరెంట్, యూరియా అందించడం దగ్గరి నుంచి పండిన పంటను సేకరించే వరకు ప్రభుత్వం ప్రతి దశలోనూ పూర్తిగా ఫెయిల్ అయ్యిందని హరీశ్ రావు విమర్శించారు. రోహిణి కార్తె ప్రవేశించినా సరే, ఇప్పటికీ ధాన్యం కళ్లాల్లోనే ఉండిపోవడం, రైతులు ఎండనక వాననక అరిగోస పడటం రాష్ట్ర చరిత్రలో ముందెన్నడూ చూడలేదన్నారు.
ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. "మొన్నేమో 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని చెప్పి, ఇప్పుడు కేవలం 70 లక్షల మెట్రిక్ టన్నులే కొంటాం అనడం ఎంతవరకు సబబు? రాష్ట్రంలో కోటి మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తే.. మిగిలిన 30 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతులు ఏం చేసుకోవాలి?" అని ప్రశ్నించారు. కేంద్రంపై నెపం నెట్టడం ఆపి, వారి మెడలు వంచైనా సరే ధాన్యం సేకరించాలని డిమాండ్ చేశారు.
"తాలు పెడితే తోలు తీస్తా" అని సీఎం రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారని, కానీ క్షేత్రస్థాయిలో సిద్దిపేట నియోజకవర్గంలోనే క్వింటాల్‌కు ఏకంగా 5 కిలోల చొప్పున తరుగు తీస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసిందని, ఈ జాప్యం వల్ల వరి కుప్పలపైనే గుండెలు బాదుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 మంది రైతులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు.
ధాన్యాన్ని ‘మిషన్ మోడ్’లో కొంటున్నామనే సీఎం వ్యాఖ్యలను తిప్పికొడుతూ.. ఇది మిషన్ మోడ్ కాదు, పూర్తిగా ‘కమీషన్ మోడ్’ అని ఆరోపించారు. నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ధాన్యం కొనుగోలుపై స్పష్టమైన నిర్ణయం వస్తుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలిందన్నారు. 45 రోజుల్లో రైతుబంధు నిధులు వేస్తామని దేవుడి మీద ఒట్టు వేసి, 60 రోజులు గడిచినా వేయకుండా మాట తప్పారని, రేవంత్ రెడ్డి కేవలం ఒక "పేపర్ టైగర్" మాత్రమేనని విమర్శించారు. ముఖ్యమంత్రి తన ఢిల్లీ ట్రిప్పులను పక్కనబెట్టి, కళ్లాల్లో ఉన్న వడ్లను తరలించడానికి లారీల ట్రిప్పులను పెంచాలని హితవు పలికారు.
రాజకీయ విమర్శలు పక్కనబెట్టి రైతుల సమస్యలకు తక్షణమే పరిష్కార మార్గాలు చూపాలని హరీశ్ రావు హెచ్చరించారు. ఒకటి రెండు రోజుల్లో కొనుగోళ్లలో మార్పు రాకపోతే, స్వయంగా తానే సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట నిరవధిక ధర్నాకు దిగుతానని స్పష్టం చేశారు. అలాగే వేలాది మంది రైతులతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లను దిగ్బంధిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక జారీ చేశారు.